Greater Districts | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలను వేర్వేరు స్టేషన్లు గా చూపించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో అక్కడి వారు ఇక్కడికి.. ఇక్కడి వారు అక్కడికి బదిలీ అయ్యే అవకాశం దొరికింది. రెండు జిల్లాలకు చెందిన కార్యాలయాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటే మాత్రం, జీహెచ్ఎంసీలోనే అంతర్భాగంగా పరిగణిస్తారు. జీహెచ్ఎంసీ బయట ఏ జిల్లాలో ఉంటే ఆయా జిల్లా స్టేషన్‌గా పరిగణిస్తారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సీఎస్‌ను కలిసి నిబంధనను మార్చాలని కోరారు. స్పందించిన సర్కారు వేర్వేరు స్టేషన్లుగా పరిగణనలోకి తీసుకుంటూ ఉత్తర్వులిచ్చింది.
దేవాదాయ శాఖ ఈవోలకు ఉద్యోగోన్నతి
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. ఆరేండ్లుగా సర్వీ స్ రూల్స్, సీనియారిటీ విషయంలో జాప్యం కారణంగా ఉద్యోగోన్నతిలో ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా సమస్య పరిష్కారంతో 11 మంది ఈవోలకు లబ్ధి చేకూరింది. ముగ్గురు గ్రేడ్-3 ఈవోలు గ్రేడ్-1గా, 8 మంది గ్రేడ్-3 ఈవోలు గ్రేడ్-2గా ఉద్యోగోన్నతి పొందారు. ఇందుకు మంత్రి కొండా సురేఖకు ఆలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు బేతి రంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పదోన్నతుల్లో నిబంధనలు పాటించాలి
తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల ఉద్యోగుల సంఘం
హైదరాబాద్, జూలై12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్న అర్హులైన డిగ్రీ లెక్చరర్లకే ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించాలని తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శారద, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సత్యశ్రీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.