ఖమ్మం: జిల్లానుంచి రాజ్యసభకు ఎంపికైన తర్వాత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి తొలిసారిగా శనివారం ఖమ్మం వచ్చారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం చేరుకోగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మద్దులపల్లి వద్ద గజ మాలతో సత్కరించారు. ఎంపీలు వద్దిరాజు రవించంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి విజయ సంకేతం చూపుతూ ముందుకు కదిలారు.
ఖమ్మం, వరంగల్ క్రాస్ రోడ్డులో రెండు చోట్ల వారిని కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించారు. ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహణ కమిటీ కోరిక మేరకు ఎంపీ రవిచంద్ర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యువత బైక్ ర్యాలీ తీసి, ఘనస్వాగతం పలికారు. జై కేసీఆర్, జై కేటీఅర్ .. జై తెలంగాణ నినాదాలతో రోడ్లన్నీ మార్మోగాయి. ఎంపీలిద్దరూ ఖమ్మం నగరం మయూరి సెంటర్‌లోగల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. జడ్పీ సెంటర్లో గుర్రాలు, కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పులు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. వైరా రోడ్డు మీదుగా కోలాటం, డప్పు లతో సభాస్థలి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది.