పర్వతగిరి, డిసెంబర్ 21: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో గ్రామపంచాయతీ భవనాలు నిర్మించి, బిల్లులు రాక అప్పుల పాలయ్యామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తంచేశారు. హట్యా తండాలో ఐటీడీఏ గ్రాంట్ నుంచి రూ. 20 లక్షల నిధులతో జీపీ భవనం నిర్మించినా ఇప్పటి వరకు బిల్లులు రాలేదని మాజీ ఉపసర్పంచ్ భూక్యా తిరుపతి, మాజీ సర్పంచ్ భర్త వెంకట్రామ్ పేర్కొన్నారు. మల్యా తండాలో రూ. 38 లక్షలతో జీపీ బిల్డింగ్ కట్టి, బిల్లులు రాక నివాస గృహాలను తాకట్టు పెట్టి అప్పులు కడుతున్నామని మాజీ సర్పంచ్ భర్త ఈర్యానాయక్ ఆదివారం మీడియాతో పేర్కొన్నారు. కొత్త సర్పంచుల పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాళాలు వేస్తామని, బిల్లులు వచ్చే వరకు తీయమని స్పష్టం చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు స్పందించి తక్షణమే బిల్లులు చెల్లించాలని, లేకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.