హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ వ్యవస్థ ఇకనుంచి పటిష్ఠం కానున్నది. కొత్త డిప్యూటీలు రానుండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణపై పట్టు లభించనున్నది. తాజాగా పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ ఈవో పోస్టులను భర్తీచేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు ఈ పోస్టుల భర్తీకి కసరత్తు ముమ్మరం చేశారు. మల్టీ జోన్వారీగా పోస్టులు, అర్హతలు, రోస్టర్, సర్వీస్ రూల్స్ వంటి అంశాలను క్రోడీకరించి, పూర్తి వివరాలతో కూడిన ఇండెంట్‌ను త్వరలోనే టీఎస్పీఎస్సీకి సమర్పించనున్నారు.
2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా 43 డిప్యూటీ ఈవో పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ పోస్టులను భర్తీచేయలేదు. తాజాగా ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖలో క్లస్టర్ నోడల్ అధికారి, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరరీ (ఎఫ్ఎల్ఎన్) నోడల్ అధికారులను నియమించారు. వీరికి డిప్యూటీ ఈవోలు తోడైతే పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ మరింత బలంగా కొనసాగనున్నది. ఈ పోస్టులకు గతంలో బీఈడీతో పాటు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు కాగా, ప్రస్తుతం ఇవే అర్హతలను కొనసాగించనున్నట్టు తెలుస్తున్నది.