GO 33 | తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైద్య విద్యార్థుల పెరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీ రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఈ చంద్రశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 33 జీవోతో ఎంతో మంది రాష్ట్ర విద్యార్థులు విఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉందని ఆరోపించారు. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు తెలంగాణలో చదివితే స్థానికత ఉన్నట్లుగా గుర్తించే వారని తెలిపారు.
తాజా జీవోతో 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వాళ్లనే తెలంగాణ స్థానికులుగా గుర్తించడం సరికాదన్నారు. దాంతో ఎంతో మంది తెలంగాణ విద్యార్థులు వైద్యులయ్యే అవకాశం కోల్పోతారన్నారు. ఇక్కడి వనరులు, అవకాశాలు ఇక్కడి వాళ్లకే దక్కాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పందని.. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 33ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైద్య విద్యార్థుల పెరేంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో సీఎం రేవంత్, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పునరాలోచన చేయాలని సూచించింది.