కాచిగూడ, అక్టోబర్ 22: ప్రభుత్వం విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించకుంటే తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 16 లక్షల మంది కాలేజీ విద్యార్థుల స్కాలర్షిప్పులను రూ.5,500 నుంచి రూ.20 వేల వరకు పెంచాలని బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బర్కత్పుర సర్కిల్లో మంగళవారం ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీ విద్యార్థులకు రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ప్రైవేటు యూనివర్సిటీలో అమలు చేయాలని సూచించారు. డే-స్కాలర్షిప్పులను ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ కోర్సులకు రూ.20 వేలు పెంచాలని కోరారు. ర్యాలీలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, నీలం వెంకటేశ్, సుధాకర్, వీరన్న, ఉదయ్, రాజ్ కుమార్, నిఖిల్ పాల్గొన్నారు.
రీయింబర్స్మెంట్పై భగ్గుమన్న విద్యార్థి లోకం
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సూర్యాపేటలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య, నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్స్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుం డా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -నల్లగొండ/సూర్యాపేటటౌన్