హనుమకొండ, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యాన్ని ఎంగట్టేందుకు బీఆర్ఎస్ వరంగల్‌లో చేపట్టిన రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా ప్రభుత్వం పెట్టిన మెగా రైతు మేళా నిర్వహణా వైఫల్యంతో ఆగమాగంగా ముగిసింది. సాగు యాంత్రాలు, విత్తనాలు, పురుగు మందులు, బర్లు, గొర్లు, కోళ్లు, పట్టు పురుగుల పెంపకం, పామాయిల్ తోటల సస్యరక్షణ వంటి వాటిపై రైతులకు అగాహన కల్పించేందుకు వందకుపైగా స్టాళ్లను రైతు మేళాలో ఏర్పాటు చేశారు. వడ్లు, మక్కజొన్నల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది రైతులు మేళాకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. తీవ్రమైన ఎండలతో ఉద్యాన పంటల రైతుల్లో ఎక్కువ మంది ఇటువైపు రాలేదు. అధికారులు బతిమాలి ఆర్టీసీ బస్సుల్లో కొందరు రైతులను మేళా వద్దకు తీసుకొచ్చారు.
గురువారం మేళాకు వచ్చిన రైతులను స్టాళ్ల వద్దకు వెళ్లకుండా హనుమకొండ జిల్లా ఉన్నతాధికారులు ఇబ్బందులు పెట్టారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వస్తున్నారని, ఆయనతోపాటు ఎమ్మెల్యేల ప్రసంగం ముగిసేవరకు అందరూ వేదిక వద్దనే ఉండాలని, స్టాళ్ల వద్దకు వెళ్లొద్దని అధికారులు రైతులపై ఒత్తిడి తెచ్చారు. స్టాళ్లలో ఉన్న రైతులను బలవంతంగా వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రసంగ కార్యక్రమం రెండు గంటలు పట్టింది. అప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. తీవ్రమైన ఎండతో రైతులు బయటకు వెళ్లి భోజనం చేశాక తమ గ్రామాలకు వెళ్లిపోయేందుకు యత్నించగా సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే బస్సులు కదులుతాయని అధికారులు చెప్పడంతో కంగుతిన్నారు. స్టాళ్లు చూడనివ్వకుండా మేళాకు ఎందుకు తీసుకొచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఊరిలో కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు, ఇండ్ల దగ్గర మక్కజొన్నలు ఉన్నాయని, వెంటనే వెళ్లి దగ్గర పోసుకోవాలని చెప్పారు.
హనుమకొండ సబర్బన్/హనుమకొండ, మే 7 : వరంగల్ ఉమ్మడి జిల్లాలో మక్కలు, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు వాస్తవమేనని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంగీకరించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి రైతు మేళా ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు కొనుగోళ్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు కాంటాలను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో యూరియా పంపిణీ కోసం తెచ్చిన యాప్‌తో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలోనూ ఆలోచించాలని కోరారు.