బోడుప్పల్, మార్చి29 : నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.కోటి ప్రభుత్వ నిధులతో బోడుప్పల్ మల్లాపూర్ ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం నగర పరిధిలోని 16డివిజన్ బీఎల్ నగర్ కాలనీలో రూ.50 లక్షల మున్సిపల్ సాదారణ నిధులతో వంద పడకల దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో బస్తీ దవాఖాలతో నిరుపేదలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. త్వరలో బోడుప్పల్ నగరప్రజలకు వందపడకల దవాఖాన అందుబాటులోకి వస్తుందన్నారు.
కార్యక్రమంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, స్థానిక కార్పొరేటర్లు, మెడికల్ ఆఫీసర్ డా. సుజాతరావు, తదితరులు పాల్గొన్నారు.