సారపాక, ఫిబ్రవరి 23: తనపై చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి విఫలమైన నాయకుడని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఆయనకు తనను విమర్శించే అర్హత లేదని అన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై అన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 2009కి ముందు పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే లేదని, తానే ఆ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే బీఆర్ఎస్ లో విలీనమయ్యామని అన్నారు. ఇటీవల కొందరు రూ.100 కోట్ల ఆఫర్ అంటూ ప్రలోభపెట్టినా తాను లెక్కచేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు తన మీద చేసిన ఆరోపణలపై చర్చించేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. తనపై విడుదల చేసిన చార్జిషీట్లో ఆరోపణలు నిజమని తేలితే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని, కానీ అబద్ధాలని తేలితే రేవంత్‌పై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.