హైదరాబాద్, జనవరి 11 (నమస్తేతెలంగాణ): ‘గేమ్ చేంజర్’ సినిమాపై ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. అదనపు షోలు, టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఈ నెల 8న జారీచేసిన జీవోను ఉపసంహరించుకున్నది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘గేమ్ చేంజర్’కు ఇచ్చిన ప్రత్యేక అనుమతులపై 24 గంటల్లోగా సమీక్షించాలని శుక్రవారం హైకోర్డు ఆదేశించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. కానీ, ఇక్కడ మరో మెలిక పెట్టింది. ప్రత్యేక అనుమతుల ఉపసంహరణ ఉత్తర్వులు ఈ నెల 16 తర్వాత అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. అంటే.. అప్పటివరకు అదనపు షోలు, పెంచిన టికెట్ ధరలు కొనసాగుతాయన్నమాట. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఓసారి ప్రకటించి యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వులతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒకే అంశంలో రెండోసారి యూటర్న్ తీసుకున్నట్టయింది.