కోదాడ: మద్యం మత్తులో సిగరెట్ వెలిగించుకుని.. దానిని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంటలు చెలరేగడంతో మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) మండలంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగలి తండాకు చెందిన ధరావత్ బాలాజీ (52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఆయన భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లారు. ఇంట్లో ఒక్కడే ఉండడంతో మద్యం సేవించారు. సిగరెట్ తాగుతూ మంచంపై ఆరుబయట మంచంపై పడుకున్నారు. మత్తులో నిద్రలోకి జారుకోవడంతో సిగరెట్ మంచం నవారుపై పడి మంటలు చెలరేగాయి. దానికి కూలర్ గాలి తోడవడంతో భారీగా ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం, బాలాజీ మద్యం మత్తులో ఉండటంతో శరీరానికి మంటలు అంటుకుని అక్కడికక్కడే మృతిచెందారు. బాలాజీ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఎం.అనిల్‌రెడ్డి తెలిపారు.