హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో రూ.3.04 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తయారుచేసింది ఉద్యోగులే. బడ్జెట్ ప్రతులను ముద్రించిందీ, వాటిని అసెంబ్లీకి చేర్చిందీ ఉద్యోగులే. కానీ, రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీ ప్రస్తావనేలేదు. కొత్త బడ్జెట్లో వేతన సవరణ ప్రస్తావనే లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు. వాస్తవానికి 1% ఫిట్మెంట్ ప్రకటిస్తే, నెలకు రూ.200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి.
ఉద్యోగులు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువలో తక్కువగా 25% ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు రూ.5 వేల కోట్ల చొప్పున ఉద్యోగులకు వస్తాయి. బడ్జెట్లో పీఆర్సీ ప్రస్తావనే లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచిచూడాల్సిందేనని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని ఇవ్వాల్సి ఉన్నది. గత కేసీఆర్ సర్కారు 2023 అక్టోబర్‌లో పీఆర్సీ కమిటీని నియమించింది.
ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. పలు ఉద్యోగ సంఘాల నేతలు 50% ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రతిపాదనలు సమర్పించారు. పీఆర్సీ కమిటీ నివేదిక ఎప్పుడిచ్చినా జూలై 1 నుంచి ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది. సర్కారు తప్పించుకోవడానికి వీల్లేదు. మొదటి పీఆర్సీకి, తాజాగా ప్రకటించాల్సిన రెండో పీఆర్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం 5% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. ఈ ఐఆర్‌పై అతీ గతీ లేదు. ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా, జూలై 1 వస్తే ఆరో డీఏ పెండింగ్‌లో పడనున్నది. ఉద్యోగులు డీఏల గురించి అడిగి, బంద్‌లకు దిగితే జీతాలే ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల హెచ్చరించడం గమనార్హం. గత కేసీఆర్ సర్కా రు మాత్రం ఉద్యోగుల వేతనాలను 73% పెంచింది.