Jana Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘నా ఇంటికే టెండర్ వేస్తారా..? సీఎంతో మాట్లాడతా.. ఎన్నో ప్రభుత్వాలను చూశా.. నా ఇంటి స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు’ అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన ఇంటి వద్ద మార్కింగ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై కస్సుబుస్సులాడినట్టు అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయనతోపాటు నటుడు, ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కేబీఆర్‌పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్సిటీ) ప్రాజెక్టు కింద రూ.1,090 కోట్లతో ఎనిమిది స్టీల్‌బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్‌ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసి, వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన పిల్లర్లు వేయాల్సిన ప్రాంతాల్లో భూ పరీక్షలు జరిపే ప్రాం తాలను గుర్తించిన అధికారులు మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. గత ఆరు రోజులుగా ముమ్మరంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్‌తోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని బాలకృష్ణ ఇంటి భాగంలో కొంత మేర భూ సేకరణ కింద పోతుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కింగ్ చేసేందుకు వెళ్లిన అధికారులతోపాటు ప్రభుత్వంలోని ముఖ్యనేతలపై జానారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా, తన భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు బాలకృష్ణ సైతం తన స్థలంలో భూసేకరణను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తున్నది. వీరితోపాటు ఈ ప్రా జెక్టు ప్రాంతంలో మరికొందరు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల ఆస్థు లు ఉండటంతో భూసేకరణ వ్యవహారం పెద్ద సవాలుగా మారుతున్నది.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కేబీఆర్ పార్కు చుట్టూ రహదారి విస్తరణ చేపట్టా ల్సి ఉన్నది. టీడీపీ కార్యాలయం పక్కన మినహా చుట్టూ రోడ్డును విస్తరించనున్నారు. ప్రస్తుతం వంద అడుగుల మేర ఉ న్న రోడ్డును 120 అడుగులకు విస్తరించనున్నారు. ఈ రహదారి కింద మార్గంలో అండర్‌పాస్‌లు, పైన స్టీల్బ్రిడ్జిలతోపాటు 120 అడుగుల రోడ్డు కార్యరూపం దాలిస్తే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య ఉండదని భావిస్తున్నారు. రహదారి విస్తరణకు 87 ఆస్తులను సేకరించనున్నారు.
కేబీఆర్‌పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా రోడ్డు నంబర్ 45లోని బాలకృష్ణ ఇంటివైపు, సీవీఆర్న్యూస్ చానల్ చౌరస్తా, భారతీయ విద్యాభవన్స్ స్కూల్ వైపు, అగ్రసేన్ చౌరస్తా, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వైపు ఈ ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూ పొందించారు. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం డిజైన్లు పూర్తి చేశారు. ఎక్కడెక్కడ పిల్లర్లు నిర్మించాలో ఆ ప్రాం తాల్లో మార్కింగ్ పూర్తి చేశారు. ప్రాథమికంగా భూ పరీక్షలు పూర్తయిన తర్వాత పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారు.
కేబీఆర్ పార్కు చుట్టూ అగ్రసేన్, ఫి లింనగర్, క్యాన్సర్ దవాఖాన, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం ఇలా ఆరు జంక్షన్లు ఉన్నాయి. ఈ జంక్షన్లలో ఎనిమిది స్టీల్‌బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. జూబ్లీహిల్స్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద రెం డు చొప్పున నాలుగు స్టీల్‌బ్రిడ్జిలు రానున్నాయి. మిగతా నాలుగు జంక్షన్ల వద్ద ఒ క్కో స్టిల్బ్రిడ్జి చొప్పున, ఆరు జంక్షన్ల వద్ద ఒక్కొక్కటి చొప్పున ఆరు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.
చిరంజీవి బ్లడ్‌బ్యాంకు నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లై ఓవర్‌పై భాగంలో రెండు లేన్లతో రానున్నది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ నంబర్ 36 వైపు వెల్లే నాలుగు లేన్ల కింద నుంచి వెళ్లనున్నది. ఆయా నిర్మాణాలతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని అభ్యంతరం వ్యక్తంచేస్తూ గతంలో పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించారు. అయితే, గ్రీనరీపై ఎటువంటి ప్ర భావం పడకుండా పనులు చేస్తామని, చె ట్లు తొలగించాల్సి వస్తే ట్రాన్స్‌ఫ్లాంటేషన్ చేస్తామని అధికారులు చెప్తున్నారు.