హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ అడ్మిషన్లు భారీగా తగ్గుతున్నాయి. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ఏటా 10-20వేల మంది విద్యార్థులు తగ్గుతున్నారు. ముఖ్యంగా 2025-26 విద్యాసంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఏకంగా 17 వేల మంది విద్యార్థులు తగ్గారు. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు రిటెన్షన్ రేటు ఆందోళన కలిగిస్తున్నది. ఇంటర్ విద్యాశాఖ కేవలం ఫస్టియర్ అడ్మిషన్లపైనే ఫోకస్ పెడుతున్నది. సెకండియర్‌లో నిలుపుదల.. కొత్త అడ్మిషన్లపై అంతగా దృష్టిసారించడం లేదు. డ్రాపౌట్ అయిన విద్యార్థులు మళ్లీ చదువులు కొనసాగించేందుకు చొరవ తీసుకోవడంలేదు.
ఒక వైపు ఫస్టియర్, సెకండియర్ రెండు కోర్సుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నది. 2022-23లో 1.80లక్షలుండగా,2023-24లో 1.63 లక్షలకు తగ్గింది. ఈ ఒక్క ఏడు మినహాయించగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నది. 2024-25లో 1.68లక్షలకు పెరుగగా.. 2025-26లో 1.72లక్షలకు చేరుకున్నది. ఈ పెరుగుదల ఫస్టియర్కే పరిమితమైనట్టు గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ఫస్టియర్‌లో చేరుతున్న విద్యార్థులను సెకండియర్ వరకు కొనసాగించడంలో కాలేజీలు ఎందుకు విఫలమవుతున్నాయి..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అయ్యేందుకు గల కారణాలేమిటీ..? ప్రైవేట్ కాలేజీలకు తరలిపోతున్నారా..? లేక ఫెయిలైన వారు ఆర్థిక పరిస్థితులతో చదువులకు గుడ్‌బై చెబుతున్నారా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయించాల్సిన అవసరమున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.