హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్- నరేగా) ఇక చరిత్ర కాబోతున్నదా? జూలై నుంచి అమలులోకి రానున్న కొత్త ‘వీబీ జీ రామ్ జీ’ చట్టం, గ్రామీణ కూలీల హకులను కాలరాసే విధంగా ఉండబోతున్నదా? ఇప్పటివరకు పని అడగడం ఒక ‘హకు’ అయితే, జూలై నుంచి అది కేవలం ఒక ‘వినతి’గా మారబోతున్నదా? గ్రామీణ పేదల నోటికాడ కూడు దూరంచేసే దిశగా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్జీ) చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నది.
ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. వీబీ జీ రామ్ జీ పథకం విధివిధానాలు, వేతన చెల్లింపులు, సమస్యల పరిషార వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీచేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదించాల్సి ఉన్నట్టు పేర్కొన్నది. కొత్త పథకం వచ్చినప్పటికీ కూలీలకు ఎలాంటి అంతరాయం లేకుండా పని దినాలు లభిస్తాయని కేంద్రం చెప్తున్నది. ఉపాధి హామీ కింద జారీచేసిన జాబ్ కార్డులు ఈ-కేవైసీ పూర్తయి ఉంటే కొత్త కార్డులు జారీచేసే వరకూ చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
రాష్ట్రంలో ఈ కేవైసీ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటివరకు ఈ-కేవైసీ చాలా మంది కూలీలకు పూర్తికాలేదని సమాచారం. గతంలో ఉపాధి హామీ పథకం కింద పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. పని అడిగిన 15 రోజుల్లోగా పని చూపించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలనే నిబంధన ఉండేది. కానీ, కొత్తగా రాబోతున్న మార్పుల ప్రకారం.. కూలీలు పని అడిగితే ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నిధుల లభ్యత లేదా ఇతర సాంకేతిక కారణాలు చూపి పనిని తిరసరించే అవకాశం అధికారుల చేతిలో ఉంటుంది. ఉపాధి చట్టబద్ధమైన హకు హోదాను కోల్పోయి, ఒక సాధారణ సంక్షేమ పథకం స్థాయికి పడిపోయే ప్రమాదం ఉన్నది.
ఇప్పటికే ఉపాధి హామీకి బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీబీ జీ రామ్ జీ చట్టం ద్వారా నిధుల కేటాయింపులో కేంద్రం మరింత పట్టు బిగించనున్నది. దీనివల్ల రాష్ట్రాలకు అందే నిధులు తగ్గి, క్షేత్రస్థాయిలో కూలీలకు సకాలంలో డబ్బులు అందవు. గతంలో మాదిరిగా కాకుండా, పని గుర్తింపులోనూ, మ్యాపింగ్ లోనూ కొత్త పరిమితులు వస్తున్నాయి. దీనివల్ల నిజమైన పేదలకు పని దొరకడం కష్టతరమవుతుంది. కేవలం కొన్ని రకాల పనులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సాధారణ పనులకు ఆసారం తగ్గుతుంది.