ములుగు, అక్టోబర్ 26 (నమస్తేతెలంగాణ): ఓ కాంగ్రెస్ నాయకుడు పోలీస్ స్టేషన్లోనే గూండాగిరికి దిగాడు. పోలీసుల ఎదుటే బాధితుడిపై దాడి చేశాడు. ఈ ఘటన ములుగులో శనివారం రాత్రి జరిగింది. ములుగుకు చెందిన సర్వే నంబర్ 1256లోని 7 ఎకరాల భూమి లో తనకు 11 గుంటల భూమి వస్తుందని కాంగ్రెస్ నాయకుడు పోరిక రాజూనాయక్ భూ యజమాని ముర్తాల గురువారెడ్డితో శనివారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు.
పంచాయితీ అనంతరం గురువారెడ్డి తరఫు పెద్దమనుషులు ములుగు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జన్ను రవి, నద్దునూరి రమేశ్, ఇంచర్ల పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాము లు, ఓరుగంటి అనిల్, దామెర రాజు ములుగులోని ఓ టీ కొట్టు వద్ద కూర్చున్నారు. రాజూనాయక్ అనే వ్యక్తి ఫోన్లో జన్ను రవిని ఎక్కడున్నారనే సమాచారం కనుక్కొని తన కుమారుడు సునీల్‌నాయ క్, మరో నలుగురు అనుచరులతో వచ్చి దుర్భాషలాడాడు.
ఈ క్రమంలో సదరు వ్యక్తులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా డ్యూటీలో ఉన్న పోలీసుల ముందే జన్ను రవిపై రాజూనాయక్ చేయిచేసుకున్నాడు. ఎస్సై వెంకటేశ్వర్రావు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని గొడవపై ఆరా తీశారు. రాజూనాయక్ను పీఎస్ నుంచి వెళ్లాల్సిందిగా చెప్పినప్పటికీ రాజునాయ క్, అతడి కుమారుడు వెళ్లకుండా ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. దీంతోపాటు ఫిర్యాదుదారులను నడిరోడ్డుపై నరికేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. జన్ను రవి ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.