హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): కూరగాయల బుట్టల సరఫరాకు సంబంధించి హాకా సంస్థ నిర్వహించిన టెండర్లలో గోల్మాల్ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. టెండర్లు పూర్తయిన తర్వాత తక్కువ ధర కోట్ చేసిన వ్యక్తికి కాకుండా ఎక్కువ ధర కోట్ చేసిన వ్యక్తికి టెండర్ కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎల్-1గా ఎంపికైన కాంట్రాక్టర్‌కు కాకుండా ఎల్-3గా నిలిచిన కాంట్రాక్టర్‌కు టెండర్‌ను ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎల్-1 టెండర్‌దారు.. ఇదేం విధానమంటూ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది.
ఎల్-3కి టెండర్ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎల్-1 టెండర్‌దారు.. ఇందుకు కారణం చెప్పాలని అధికారులను నిలదీసినట్టు తెలిసింది. అయితే, ఇందుకు అధికారులు చెప్పిన కారణం విచిత్రంగా ఉండటం గమనార్హం. తమకు కేవలం నీల్కమల్ కంపెనీ వస్తువులు మాత్రమే కావాలని, ఇతర కంపెనీల వస్తువులు అవసరంలేదని చెప్పినట్టు తెలిసింది. అందుకే నీల్కమల్ వస్తువులను సరఫరా చేసే ఎల్-3 టెండర్‌దారుకు టెండర్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అయితే దీనిపై ఎల్-1 టెండర్‌దారు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. టెండర్ పిలిచినప్పుడు కేవలం ఒకే కంపెనీకి చెందిన వస్తువులు కావాలని పేర్కొనకుండా ఇప్పుడు అవే కంపెనీవి కావాలంటే ఎలా? గ్లోబల్ టెండర్లు పిలిచి ఇప్పుడు సెలెక్టెడ్ కంపెనీ వస్తువులు కావాలంటే ఎలా? అని నిలదీసినట్టు తెలిసింది. అలాంటప్పుడు టెండర్లోనే నిబంధన పెట్టి ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈమాత్రం దానికి టెండర్ ఎందుకు పిలిచారని, ఆ కంపెనీకే ఏకపక్షంగా సరఫరా అప్పగిస్తే సరిపోయేది కదా అని మండిపడ్డట్టు తెలిసింది. అయితే కమీషన్ల లెక్క తేలకపోవడంతోనే కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.