వరంగల్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గోదావరి వరద బీభత్సం సృష్టిస్తున్నది. వరద ప్రభావం నదీ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నది. అధిక వానలతో వచ్చిన వరదతో దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశలోని మూడో ప్యాకేజీ పనులకు ఆటంకం కలుగుతున్నది. నిరంతరంగా వస్తున్న వరద, ఎడతెగని వానలతో ప్రాజెక్టులు పనులు నిలిచిపోయాయి. ములుగు జిల్లా రామప్ప ట్యాంక్ నుంచి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వరకు నీటి తరలింపు కోసం ఈ పనులు జరుగుతున్నాయి. గోదావరి నదికి వచ్చిన వరదలు.. టన్నెల్, సర్జ్‌పూల్ సమీపంలోని చెరువులు నిండటంతో వీటిలోకి నీరు చేరి ఈ పనులకు అటంకం కలుగుతున్నది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో మూడో దశలోని మూడో ప్యాకేజీ పనుల్లో భాగంగా 49 కిలోమీటర్ల భూగర్భ టన్నెల్ నిర్మించారు. సర్జ్‌పూల్ మొదటి గేట్ నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా రెండో గేట్ పనులు కొనసాగుతున్నాయి. తాజా వరదలతో ఈ భూగర్భ టన్నెల్, సర్జ్‌పూల్‌లోకి నీరు వచ్చి చేరుతున్నది. తాజా వరదతో పనులు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది.