Banakacharla | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : తొలుత గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని, ఆ తరువాత కావేరికి జలాలను తరలించే అవకాశం ఉంటుందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. అందుకు కేంద్రం సైతం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలోనే నదుల అనుసంధాన ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని హడావుడిగా నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఈ సమావేశం గురువారం ఢిల్లీలో జరగనున్నది. నదుల అనుసంధాన ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తమిళనాడుకు తాగునీటిని తరలించేందుకు గోదావరి-కావేరి ఇంటర్‌స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఆ ప్రాజెక్టుకు ఆమోదం పొందేందుకు సంబంధిత రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో ఇప్పటికే ఆరుసార్లు సమావేశాలు నిర్వహించింది. సాంకేతిక అంశాలపై చర్చించింది.
తమిళనాడు, కర్ణాటక మినహా బేసిన్‌లోని ఇతర రాష్ర్టాలేవీ అందుకు అంగీకరించలేదు. గోదావరి-కావేరి (జీసీ) లింక్‌పై తెలంగాణ సైతం ఆదినుంచీ అనేక అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నది. సమ్మక్కసాగర్ నుంచే లింక్ ప్రాజెక్టును చేపట్టాలని, అదీ 83 ఎఫ్ఆర్ఎల్ పైన, వరద సమయంలోనే జలాలను మళ్లించాలని, ఆ విధంగా గో దావరి నుంచి మళ్లించే జలాల్లో 50% వాటా అంటే 74 టీఎంసీలను తెలంగాణకే కేటాయించడంతోపాటు ఆ మేరకు నిల్వ సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసింది. వాస్తవంగా ప్రస్తుతం జీసీ లింక్ ద్వారా మళ్లించాలని భావిస్తున్న 148 టీఎంసీలు కూడా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వినియోగించుకోని వాటా జలాలే. ప్రస్తుతం ఆ రాష్ట్రం కూడా తమ వాటా జలాలను వినియోగించుకుంటామని, ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని, కాబట్టి జీసీ లింక్‌కు అంగీకరించబోమని తేల్చిచెప్పింది.
దీంతో జీసీ లింక్ ప్రాజెక్టు ముందుకుపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, ఏపీ కొత్తగా పావులు కదుపుతున్నాయని తెలుస్తున్నది. కాగా, గోదావరి-కావేరి లింక్‌ను పోలవరం నుంచే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మొదటినుంచీ ప్రతిపాదిస్తూ వస్తున్నది. కేంద్రం తొలుత వ్యతిరేకించినా ప్రస్తుతం అందుకు అంగీకరించినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే ఏపీ తాజాగా ఇంట్రాస్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్టు పేరిట గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్‌ను తెరమీదకు తీసుకొచ్చింది. తద్వారా గోదావరి జలాలను తొలుత కృష్ణా మీదుగా బనకచర్లకు తరలించి, అక్కడినుంచి సోమశిలకు, ఆపై కావేరికి తరలించే అవకాశం ఉన్నది. దీంతో ఇటు ఏపీతోపాటు అటు కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరనున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్రం గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టును పక్కనపెట్టి, జీబీ లింక్ ప్రాజెక్టుకు మద్దతు తెలిపినట్టు సమాచారం. దీంతో తెరమీదకు ‘గోదావరి-సోమశిల-కావేరి’ లింక్ ప్రాజెక్టు వచ్చింది. కేంద్రం సైతం ఏపీ ప్రతిపాదించిన ఇంట్రా స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్టు ఆర్థిక సాయం అందిస్తామని బాహాటంగానే ప్రకటించింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీబీ లింక్‌పై దూకుడుగా ముందుకుపోతున్నది.
నదుల అనుసంధాన ప్రాజెక్టులను చేపట్టేందుకు తొలుత బేసిన్ రాష్ర్టాలతో కేంద్రం సాంకేతిక సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆ కన్సల్టెన్సీ మీటింగ్‌లో రాష్ర్టాలు లేవనెత్తిన అంశాలపై రివర్లింక్ ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ అవుతుంది. లేదంటే ఏకకాలంలో కన్సల్టెన్సీ, టాస్క్‌ఫోర్స్ కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఆయా అంశాలపై రాష్ర్టాల వారీగా చర్చించడం పరిపాటి. అందులో భాగంగా ఈ 12న జీసీ (గోదావరి-కావేరి) లింక్‌పై కన్సల్టెన్సీ మీటింగ్‌ను హైదరాబాద్ జలసౌధలో నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయించింది. కానీ, అకస్మాత్తుగా ఆ సమావేశం 24కు వాయిదాపడింది. కానీ, ఇప్పుడు కన్సల్టెన్సీ మీటింగ్ లేకుండానే ఉన్నట్టుండి 12వ తేదీన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దీని వెనుక అసలు మతలబు గోదావరి-బనకచర్ల-సోమశిల-కావేరి లింక్ ప్రాజెక్టునేనని విశ్వసనీయ సమాచారం.
గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి రూపొందించిన ప్రీ ఫీజబులిటీ రిపోర్టును (పీఎఫ్ఆర్) ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలకు పంపింది. తాజాగా ఆ రిపోర్టును గోదావరి, కృష్ణా రివర్ బోర్డులతోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సైతం కేంద్రం పంపింది. పీఎఫ్ఆర్ను పూర్తిగా అధ్యయనం చేసి అభిప్రాయాలు తెలపాలని కేంద్రం సూచించింది. దాదాపు రూ.80 వేల కోట్లతో చేపట్టనున్న జీబీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును గత నెల 23న కేంద్రానికి ఏపీ సమర్పించింది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు సైతం ప్రాజెక్టుపై ప వర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. తాజాగా పీఎఫ్ఆర్ను రివర్ బోర్డులకు, పీపీఏకు కేంద్రం పంపింది. అభిప్రాయాలను తెలపాలని సూచించింది.