హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై నమోదైన కేసులో పోలీసులు బీఎన్ఎస్ఎస్లోని 35 సెక్షన్(సీఆర్పీసీలోని 41(ఏ) సెక్షన్)ను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ సెక్షన్ కింద క్రిశాంక్‌కు నోటీసు జారీచేసి దర్యాప్తు చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 30న శశిధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు క్రిశాంక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం విచారణ చేపట్టారు. రాజకీయ కక్షతో చేసిన ఫిర్యాదు ఆధారంగా క్రిశాంక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. క్రిశాంక్‌పై మోపిన అభియోగాలు తీవ్రమైనవి కానప్పటికీ ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, శశిధర్‌రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.