భద్రాచలం, డిసెంబర్ 25 : రాజస్థాన్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన ఫేవరెట్ మిస్ టీన్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీల్లో మిస్ టీన్ తెలంగాణగా భద్రాచలం పట్టణానికి చెందిన ప్రీతి యాదవ్ నిలిచారు. భద్రాచలానికి చెందిన ప్రకాశ్ యాదవ్, రేణు దంపతుల కుమార్తె ప్రీతి యాదవ్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. తండ్రి చర్ల రోడ్డులో పానీపూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా.. తల్లి రేణు మోడలింగ్ రంగంపై అనుభవం ఉండటంతో కుమార్తెను మోడలింగ్ పోటీలకు సిద్ధం చేస్తూ వచ్చింది. మిస్ టీన్ ఇండియా ఎంపిక పోటీల ప్రక్రియ ఏడాది క్రితమే ఆన్లైన్లో మొదలైంది. తొలి దశలో ఆన్లైన్లో బాలికల ఎంపిక కోసం కమిటీ దరఖాస్తులు ఆహ్వానించగా.. దేశవ్యాప్తంగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఆడిషన్లు గ్రూమింగ్, మూల్యాంకనాలు ఇలా.. వివిధ దశల్లో వడపోత అనంతరం 101 మంది బాలికలకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జాతీయస్థాయి వేదికపై పోటీలు నిర్వహించారు. ఇందులో వివిధ అంశాల్లో తన ప్రతిభను ప్రదర్శించి ప్రీతి యాదవ్ టైటిల్ హోల్డర్‌గా నిలిచారు. ఫేవరెట్ మిస్ టీన్ తెలంగాణ-2025 కిరీటం దక్కించుకొని జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు. మిస్ టీన్ తెలంగాణ కిరీటాన్ని అందుకున్నందుకు ప్రీతి యాదవ్‌ను భద్రాద్రి ప్రముఖులు, పట్టణవాసులు అభినందనలతో ముంచెత్తారు.