ఎల్బీనగర్ , మే 23 : ఇంటి నంబర్, ట్యాక్స్ అసెస్మెంట్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌లో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించుకుని ఇంటి నెంబర్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అందుకవసరమైన ఫీజు కూడా చెల్లించాడు.
అయినా ఇంటి నంబర్ రాకపోవడంతో సాయం కోసం తన స్నేహితుడు జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన నర్సింహారెడ్డిని సంప్రదించాడు. ఇద్దరూ కలిసి జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ భార్గవ కృష్ణను కలిసి సమస్య వివరించారు. పనికావాలంటే రూ.10వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.
అయితే, తాను కూడా ఇదే విభాగంలో పనిచేసి రిటైర్డ్ అయ్యాయని, మమ్మల్ని కూడా లంచం అడుగుతారా అని ప్రశ్నించినా డబ్బులు ఇస్తే తప్ప పని జరగదంటూ చెప్పడంతో నర్సింహారెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విజయ భార్గవ కృష్ణ రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆనంద్‌కుమార్ తెలిపారు.