నల్లబెల్లి, ఏప్రిల్ 3: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి (Chapata Chilli) జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ సర్టిఫికెట్ లభించింది. ఈ మేరకు తిమ్మంపేట ఎఫ్పీఓ పేరుపై సర్టిఫికెట్ ఇష్యూ చేసిన జీఐ రిజిస్ట్రీ.. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి అందచేసింది. దీంతో నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన కృషికి ఫలితం దక్కినట్లయింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం మిర్చి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సంపేట ప్రాంతంలో పండుతున్న చపాట మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్విచదగిన విషయమన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా తాను చేసిన కృషికి నేడు గొప్ప ఫలితం దక్కడం ఆనందంగా ఉందన్నారు.
దూర దృష్టితో రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్పీవోలు నేడు సత్ఫలితాలను అందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కూడా మన ప్రాంతానికి లభించడం గర్వకారణమని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట ఎఫ్పీవో పేరు మీద చపాట మిర్చికి జీఐ సర్టిఫికేట్ లభించడానికి కృషి చేసిన నాటి వ్యవసాయ అధికారులకు, ఎఫ్పీవో సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో చపాట మిర్చికి మంచి ధర పలకడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసుకునే సౌకర్యం కూడా లభిస్తుందని, కాబట్టి ఈ సదుపాయాన్ని ప్రతి అన్నదాత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.