హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి (జీసీ) లింకు ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచే చేపట్టాలని, అప్పుడే అందుకు అంగీకరిస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. జీసీ లింకు ప్రాజెక్టుపై పలు అభ్యంతరాలను లేవనెత్తింది. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి కాంతారావు నేతృత్వంలో శుక్రవారం న్యూఢిల్లీ నుంచి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 76వ జనరల్ బాడీ సమావేశం హైబ్రిడ్మోడ్లో కొనసాగింది. గత సమావేశ నిర్ణయాలు, పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ (ఎన్పీపీ)లో భాగంగా చేపట్టిన రివర్ లింకు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ క్రమంలో గోదావరి కావేరి రివర్ లింకు ప్రాజెక్టు పురోగతిని సైతం సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీ గత వాదనలనే కొనసాగించినట్టు తెలిసింది.
ఇచ్చంపల్లి నుంచి జీసీ లింకు ప్రాజెక్టును చేపట్టేందుకు సమ్మతించబోమని, పోలవరం నుంచే ఆ ప్రాజెక్టును చేపట్టాలని మరోసారి ప్రతిపాదించినట్టు సమాచారం. జీసీ లిం కులో భాగంగా తమకు కేటాయిస్తున్న 16 టీఎంసీలను ఆల్మట్టి ద్వారా వినియోగించుకుంటామని, అందుకు అనుగుణంగా బెడ్తి వరద లింకును జీసీ లింకు నుంచి తొలగించాలని, ప్రత్యేకంగా అంచనాలను ప్రతిపాదనలను ఇవ్వాలని కర్ణాటక కోరినట్టు తెలిసింది. ఇదిలావుంటే, రివర్ లింకు ప్రాజెక్టుకు సంబంధించిన అభ్యంతరాలు, ప్రతిపాదనలపై కన్సల్టెన్సీ సమావేశాల్లో చర్చించాలని ఎన్‌డబ్ల్యూడీఏ సూచించినట్టు సమాచారం. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతోపాటు 95 కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించి, దానిపై చర్చించారు. సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ బాలేశ్వర్ ఠాకూర్, ఎన్డబ్ల్యూడీఏలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.