హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త లికర్ బ్రాండ్లకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ గేట్లు ఓపెన్ చేసింది. రాష్ట్రంలో అందుబాటులో లేని విదేశీ, దేశీయ లికర్ బీర్ కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానించింది. మద్యం ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాలతో విక్రయిస్తున్నట్టుగా, తమ సంస్థపై ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపే సర్టిఫికెట్ను కూడా జతపరచాలని కార్పొరేషన్ తెలిపింది. ఇటీవల కొత్త కంపెనీల రాకపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీబీసీఎల్కు నిర్దేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కార్పొరేషన్ ప్రకటన జారీచేసింది. దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నది.