పెన్పహాడ్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారూ.. మా భూమిని కాపాడాలని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాకు చెందిన బాధితులు, గిరిజన రైతులు విజ్ఞప్తి చేశారు. గ్రామ పరిధిలోని 152 సర్వే నెంబర్లో తరతరాలుగా తమ అధీనంలో ఉన్న ఎకరంన్నర భూమిని ఆక్రమించుకునేందుకు తమ తండాకు చెందిన బ్యాంకు ఉద్యోగి ధరావత్ సూర్యం అక్రమంగా పట్టా చేసుకొని గత అయిదేళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆర్థిక బలం ఉన్న సూర్యం వైపే ఉండి తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.
శనివారం పోలీసులు దగ్గరుండి జెసిబితో పని చేయిస్తుండగా తాము అడ్డుకొని జేసీబీ, పోలీసులను వెనక్కి పంపించామని చెప్పారు. కోర్టులో ఉన్న భూమి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నిస్తే అని చూడకుండా తమను నా నా బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. సామాన్యులకు సమస్య ఉందంటూ పదుల సార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోని పోలీసులు కోర్టు వివాదంలో ఉన్న భూమి విషయంలో ఎందుకు ఇంతలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారో అందులో ఉన్న మర్మమేమిటో పోలీస్ ఉన్నతాధికారులు చెప్పాలని రోదిస్తూ న్యాయం చేయాలని ఆదివారం కోరారు.
ఆందోళన వ్యక్తం చేసిన వారిలో ధరావత్ భోజ్య, బాలోజీ, లక్ష్మా, బలరాం, గుండ్య కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా ఈ విషయంపై పెన్ పహాడ్ ఎస్ఐ కాస్తల గోపి కృష్ణ వివరణ కోరగా.. భూమి వద్ద గొడవ అవుతుందని డయల్ 100కి కాల్ రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. భూమి వద్ద గొడవ కావడంతో ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించాం. ఉద్దేశపూర్వకంగా మేము అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నారు