హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పాత పింఛన్ సాధనకు దండు కట్టాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. సీపీఎస్ బాధిత ఉద్యోగులంతా కదం తొక్కాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని కా్రంగెస్ మ్యానిఫెస్టోలో హామీనిచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు ఆవశ్యకతను వివరిస్తూ ఉ ద్యోగులను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు తాము తలపెట్టిన సీపీఎస్ జన జాగరణ యాత్ర విజయవంతంగా ముగిసినట్టు ప్రకటించారు. జూలై 11 నుంచి ఆగస్టు 18 వరకు 80కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో యాత్రను నిర్వహించామని, 73 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని చెప్పారు. చివరగా ఆదివారం చలో హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ తలపెట్టినట్టు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, నరేశ్‌గౌడ్, నరేందర్‌రావు, పవన్ పాల్గొన్నారు.