మిర్యాలగూడ/ కొడంగల్, మే 27: నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆరు బస్తాల్లోని సుమారు రూ.5 లక్షల విలువైన 260 కిలోల పత్తి విత్తనాలను వన్‌టౌన్ పోలీసులు గుర్తించారు. అదే రోజు మిర్యాలగూడ రైల్వేస్టేషన్ వద్ద ముఠా సభ్యుల్లో ఒకరైనా ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పావలిపురం మండలం శానంపూడికి చెందిన గంధమల్ల శ్రీరంగా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ముఠా గుట్టురట్టయింది. పరారీలో ఉన్న ముగ్గురిని సోమవారం వాడపల్లి చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగదీశ్వర్‌రావు పరారీలో ఉన్నాడు. కాగా వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని హస్నాబాద్ గ్రామంలో తనిఖీలు నిర్వహించి 9 క్వింటాళ్ల 72 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ భరత్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.16.77 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.