హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు ఇటీవల పీహెచ్‌డీపై మనసు పారేసుకుంటున్నారు. ఏటేటా ప్రవేశాలు పెరుగుతుండడం ఈ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను చెప్పకనే చెప్తున్నది. విద్యార్థులు పరిశోధన వైపు మొగ్గు చూపడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. దేశీయంగానూ పీహెచ్‌డీలో ప్రవేశాలు ఇటీవల భారీగానే పెరిగాయి. 2017-18 విద్యా సంవత్సరం నుంచి 2021-22 విద్యాసంవత్సరం వరకు ఐదేండ్ల కాలంలో రాష్ట్రంలో పీహెచ్డీ అడ్మిషన్లు సగానికిపైగా పెరిగినట్టు ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇటీవల వెల్లడించింది. సంఖ్యాపరంగా చెప్పుకోవాలంటే 2,083 పీహెచ్డీ అడ్మిషన్లు అదనంగా నమోదయ్యాయి. వీటిలో రెగ్యులర్ పీహెచ్డీలే 90 శాతానికిపైగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 6,967 అడ్మిషన్లు రాగా అందులో 6,921 అడ్మిషన్లు రెగ్యులర్ కాగా, 46 మంది మాత్రమే దూరవిద్య ద్వారా పీహెచ్డీ కోర్సుల్లో చేరారు. నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసిన వారికి పీజీతో సంబంధం లేకుండా నేరుగా పీహెచ్డీ చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీహెచ్‌డీలో ప్రవేశాలు పెరిగేందుకు దీనిని కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఎంఫిల్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య దారుణంగా పడిపోతున్నది. 2017-18లో 794మంది ఎంఫిల్‌లో చేరితే 2021-22 నాటికి ఆ సంఖ్య 100కు పడిపోవడం గమనార్హం.
గత ఐదేండ్లలో అడ్మిషన్లు ఇలా
దేశవ్యాప్తంగా పీహెచ్డీ అడ్మిషన్లు ఇలా