పెద్దపల్లి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి ఇప్పటికే ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకొని టాప్-32గా నిలిచిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యూ ట్యూబర్ సయ్యద్ హఫీజ్‌కు మరో అరుదైన అవకాశం దక్కింది. యూఏఈ గోల్డెన్ వీసా దక్కింది. వివరాల్లోకి వెళితే.. 2011లో ‘తెలుగు టెక్ టట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ స్థాపించిన సయ్యద్ హఫీజ్, సోషల్ మీడియా వేదికగా తెలంగాణ, ఏపీతోపాటు తెలుగువారందరికీ సుపరిచితుడయ్యాడు.
ప్రధానంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లో వచ్చే అప్డేట్స్, వాటిల్లోని పాజిటివ్, నెగెటివ్స్‌ను ప్రజల ముందు ఆవిష్కరిస్తూ, దాదాపుగా 18 లక్షల సబ్‌స్ర్కైబర్లను సంపాదించుకొని డిజిటల్ స్టార్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు 4.2కే వీడియోస్ చేసి మన్ననలు పొందాడు. యూట్యూబ్ ద్వారా ప్రతి నెలా రూ.2 లక్షలకు పైనే ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రభావ శీలురైన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కథనాలతో ‘డిజిటల్ స్టార్స్’ పేరిట టాప్-100ను ప్రకటించగా, ఇందులో ‘తెలుగు టెక్ టట్స్’కు 32వ స్థానం కూడా దక్కింది.
ఈ క్రమంలో యూఏఈ ప్రపంచ వ్యాప్తంగా 10వేల మంది క్రియేటర్స్‌కు ఇచ్చే గోల్డెన్ వీసా కోసం హఫీజ్‌ను వారం రోజుల కింద ఎంపిక చేసింది. కేవలం రెండేళ్లపాటు యూఏఈలో ఉండేందుకు వీసా కావాలంటే 4.7కోట్లు ఖర్చవుతుంది. హఫీజ్‌కు పదేండ్లపాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు గోల్డెన్ వీసా రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఎనిమిది దేశాల్లో ఎక్కడై నా ఉచితంగా నివసించేందుకు ఈ వీసా ఉపయోగపడనున్నది. అక్కడ అతను ఉద్యోగం కానీ ఇతరత్రా ఏదైనా చేసుకొని జీవించవచ్చు. ‘నాకు నా కుటుంబానికి గోల్డెన్ వీసా లభించడం అదృష్టంగా భావిస్తున్నా’ అని సయ్యద్ హఫీజ్ పేర్కొన్నారు.