హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచితంగా నిర్వహించే ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు అర్హులైన గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతితోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ), కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్, ఆటో మొబైల్ 2 వీలర్ సర్వీసింగ్.. మూడు నెలల కాలపరిమితితో నిర్వహించే ఈ మూడు కోర్సులకు బీకామ్, ఇంటర్, టెన్త్ పాసైన అభ్యర్థులు అర్హులని, సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలని, ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్ ప్రతులతో యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌లోని సంస్థ కార్యాలయానికి రావాలని కోరారు. వివరాలకు 9133908000, 9133908111, నంబర్లలో సంప్రదించాలని సూచించారు.