హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పంట వేయటానికి సరైన సమయంలో వర్షాలు పడుతాయో లేదోనన్న ఆందోళన.. వర్షాలు పడి పంట భారీగా చేతికొచ్చినా మంచి ధర ఉంటుందో లేదోన్న భయం.. మనదేశంలోను రైతును నిత్యం వేధించే ఆలోచనలు ఈ రెండే.. పండ్లు, కూరగాయలు పండించేవారికి ఈ భయం మరీ ఎక్కువ. పంట చేతికొచ్చే సమయానికి ధర ఒక్కసారిగా పడిపోతుంది. కూలి డబ్బులు కూడా రాని పరిస్థితుల్లో కడుపు మండిన రైతులు పంటను రోడ్లపైనే పారేసిపోవటం చాలాసార్లు చూశాం. ఇలాంటి రైతులకు భరోసా ఇస్తున్నది బేనిషాన్.
ఒడిదుడుకుల నుంచి రక్షణ
పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సరిగ్గా రెండేండ్ల క్రితం 2019 సెప్టెంబర్ 6న ఈ సంస్థను ఏర్పాటుచేసింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) అధికారులు బెనిషాన్ పనితీరును మెచ్చుకొని ఇతర రాష్ర్టాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యులుగా ఉండి ఐదెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న వారిని బేనిషాన్లో సభ్యులుగా చేర్చుకొంటారు. వీరు పండించిన పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసిన రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో బేనిషాన్ అధికారులు డబ్బు జమచేస్తారు. బేనిషాన్లో 18 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు (ఎఫ్పీసీ)లు ఉన్నాయి. మరో 35 ఎఫ్పీసీల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఇందులో మొదట్లో ఆరు ఎఫ్‌పీసీలు రూ. 25 లక్షల చొప్పున మూలధన పెట్టుబడి పెట్టాయి. రైతుల నుంచి నేరుగా టమాట, ఆలుగడ్డ, కాలిఫ్లవర్, క్యాబేజి, మామిడి, బత్తాయి, సీతాఫలం తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వ్యాపారులకు అమ్ముతారు.
రైతులకు అన్నివిధాలా లాభం
గతంలో మా పంటను మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మితే ఒక రోజు సమయం పట్టేది. రానుపోను భారీగా రవాణా ఖర్చులుండేవి. అక్కడ ఏ ధరకు అమ్ముడుపోతాయనేది కూడా తెలియకపోయేది. ఇప్పుడు మాకు దగ్గర్లోనే ఎఫ్పీసీ కేంద్రాలున్నాయి. పంట తెంపంగనే ఎఫ్పీసీల దగ్గరికి వెళ్లి ఇచ్చేసి వస్తాం. మంచి ధర కూడా ఇస్తారు. రెండు రోజుల్లోనే డబ్బులు మా అకౌంట్లో పడుతాయి. రెండుమూడు రకాలుగా రైతులకు బేనిషాన్ మేలు చేస్తున్నది.
-ఏ రవి, ఎన్కతల, మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా
గిట్టుబాటు అయితాంది
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను ఎఫ్‌పీసీలో సభ్యులుగా తీసుకొని దీనిని ఏర్పాటు చేశాం. బేనిషాన్ ద్వారా మంచి గిట్టుబాటు అయితాంది. మార్కెట్‌కు పోవాలంటే 24 గంటలు పడుతది. వర్షంవల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకే చాలా మంది బేనిషాన్లో అమ్ముకోవడానికి ముందుకొస్తున్నారు.
కమీషన్ల బాధ తప్పింది
రైతుల దగ్గర కొనుగోలు చేయడం మంచిగా ఉన్నది. మార్కెట్‌కు పోతే కమీషన్ల బాధ ఉండేది. ఇప్పుడది తప్పింది. ప్రస్తుతం మాకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫ్పీసీ దగ్గరికి వెళ్లి కాంటా పెట్టాల్సి వస్తున్నది. కాకుండా పోలం దగ్గరే కాంటా పెడితే ఇంకా బాగుంటది.