రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్న కంపెనీ
తెలంగాణ ఇస్తున్న ప్రోత్సాహకాలపై కంపెనీ చైర్మన్ సంతృప్తి
సంస్థ ప్రతినిధులను రాష్ర్టానికి ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు గురువారం ఢిల్లీలో ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిలో తెలంగాణలో ఉన్న అనుకూల పర్యావరణ వ్యవస్థను లియుకు మంత్రి కేటీఆర్ వివరించారు.
రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుచేస్తే ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తూ, అవకాశాలను తెలుసుకొనేందుకు రాష్ర్టాన్ని సందర్శించాలని ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఉన్నదని, అత్యంత అధునాతన ఆర్అండ్డీ, ఆవిష్కరణల వ్యవస్థను కలిగి ఉన్నదని వెల్లడించారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించిన తెలంగాణలో ఫాక్స్‌కాన్ కూడా పరిశ్రమను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ తయారీలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో ఫాక్స్‌కాన్ ఒకటని, సదరు సంస్థ ఈవీల తయారీ రంగంలోకి కూడా ప్రవేశించాలని నిర్ణయించటం సంతోషించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు.
కంపెనీ చైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ.. భారత్‌లో తమ వ్యాపారం సానుకూలంగా ఉన్నదని, తెలంగాణ అందిస్తున్న ప్రోత్సాహకాలు, అక్కడి అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ఫాక్స్‌కాన్.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటి. పలు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇది పరికరాలను సరఫరా చేస్తుంది. 2021లో ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో 22వ స్థానంలో నిలిచింది.