కందుకూరు, నవంబర్ 20: పోలీసు పహారా మధ్య ఫోర్త్‌సిటీ రోడ్డు సర్వే కొనసాగుతున్నది. ఉన్న కాస్త పొలాన్ని రోడ్డు కోసం తీసుకుంటే తామెలా బతకాలని రైతులు వేడుకుంటున్నా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్, సీఐ సీతారాంల ఆధ్వర్యంలో అధికారుల బృందం రాచులూరు రెవెన్యూ పరిధిలో సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫోర్త్‌సిటీ రోడ్డు కోసం మండల పరిధిలోని లేమూరు, అగర్మియాగూడ, రాచులూరు, తిమ్మాపూరు, గాజులబుర్జు తండా, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్ గ్రామాల్లోని దాదాపు 1909 మంది రైతులకు చెందిన 441.34ఎకరాల భూమి పోతున్నది. పొలాలు తీసుకుంటే తమకు చావే శరణ్యమంటూ రైతులు.. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము సర్వే చేపడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఆపేదిలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.