కరీంనగర్ కమాన్చౌరస్తా, జూన్ 7 : శాతవాహన యూనివర్సిటీలో మూడు రోజులుగా న్యాయశాస్త్రం పరీక్షలు నిర్వహిస్తుండగా, కాన్స్టిట్యూషనల్ లా పరీక్షలో ఫ్యామిలీ లాకు చెందిన మొదటి నాలుగు ప్రశ్నలు యథావిధిగా రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థులు ఇన్విజిలేటర్లకు తెలుపగా, తమకు సంబంధం లేదని, ఉన్నతాధికారులకు తెలుపుతామని సమాధానమిచ్చారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ‘పర్లేదు రాయండి!’ అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత 30 నిమిషాలకు స్పందించిన అధికారులు, ప్రశ్నల స్థానంలో వేరే ప్రశ్నలు ఇచ్చి, అదనంగా 25 నిమిషాల సమయం ఇవ్వడంతో అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే, శాతవాహన యూనివర్సిటీలో చాలారోజుల తర్వాత ఇలా జరగడంతో యూనివర్సిటీ అధికారులు తలలు పట్టుకున్నట్టు తెలిసింది.