రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని రాష్ట్రపతికి పంపకుండా, ఆ అంశంపై ఎలాంటి నిర్ణయాన్ని తెలియజేయకుండా గవర్నర్ తాత్సారం చేస్తుంటే.. ఆ పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయాన్ని తెలియజేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): గవర్నర్లు రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించాలని లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అసౌకర్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, నేషనల్ లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వంలో అధికారం ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి అనగా మంత్రిమండలికి ఉంటుంది తప్ప గవర్నర్లకు, రాష్ట్రపతికి కాదని అన్నారు.
ఈ విషయాన్ని గవర్నర్లు, రాష్ట్రపతి తెలుసుకోవాలని చెప్పారు. వారు క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను ఆపాలని చూస్తే అది తీవ్ర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంటుందన్నారు. అది భవిష్యత్తు రాజకీయ సంప్రదాయాలకు మంచిది కాదన్నారు. పార్లమెంట్, రాష్ర్టాల శాసనసభలు ముఖ్యమైనవని, మంత్రుల మండలి శక్తివంతమైనదని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జస్టిస్ జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
‘రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని రాష్ట్రపతికి పంపకుండా, ఆ అంశంపై ఎలాంటి నిర్ణయాన్ని తెలియజేయకుండా గవర్నర్ తాత్సారం చేస్తుంటే.. ఆ పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయాన్ని తెలియజేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని విధించేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతుంది’ అని హెచ్చరించారు. చిత్తశుద్ధితో చేయాల్సిన పనులను ఎప్పటికీ సాగదీయకూడదని అన్నారు. గవర్నర్‌ను పార్టీగా చేసుకొని ప్రజలు న్యాయస్థానంలో సవాలు చేయలేరని చెప్పారు. ఒకవేళ హైకోర్టు అభ్యర్థన తర్వాత కూడా గవర్నర్ ఇంకా తాత్సారం చేస్తుంటే.. ఆయనపై ధికార కేసు పెట్టేందుకు రాజ్యాంగం ఆసారం కల్పించలేదని తెలిపారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్లు, భారత రాష్ట్రపతిపై న్యాయస్థానాల్లో దావా వేయలేమని చెప్పారు.
గవర్నర్ లేదా రాష్ట్రపతి ప్రాముఖ్యం కొన్ని సందర్భాలలో మాత్రమే ఉంటుందని అన్నారు. అసలు అధికారం అటు కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా మంత్రిమండలిదేనని తేల్చి చెప్పారు. అందువల్ల ఉభయుల మధ్య విశ్వాసం ఉండేలా చూసుకోవటం ముఖ్యమని అన్నారు. తాను న్యాయకమిషన్లో పనిచేసిన సమయంలో అప్పటి రాష్ట్రపతి ఒక కేంద్ర మంత్రిని తొలగించేందుకు తమ అభిప్రాయాన్ని కోరారని చెప్పారు. అప్పుడు తాను ప్రతికూలంగా బదులిచ్చానని తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్చాన్సలర్లను తొలగించాలని గవర్నర్ పట్టుబట్టిన మరొక సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు. వైస్చాన్సలర్లను తొలగించే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పంథాలో పాలన సాగేలా చూసే అవగాహన రాజ్యాంగ పదవుల్లోని అందరికీ ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.