హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/బొల్లారం: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో మాజీ సర్పంచులు సచివాలయం ఎదుట శుక్రవారం నిర్వహించ తలపెట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్న 6,000 మంది మాజీ సర్పంచులను పోలీసులు మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ను సచివాలయం సమీపంలో అరెస్టు చేసి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధికి తాము ఖర్చుచేసిన పెండింగు బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమంగా అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సుమారు రూ.1500 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా ఇంకా ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. అప్పులబాధ తాళలేక పలువురు మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గాంధేయమార్గంలో సచివాలయం ఎదుట తలపెట్టిన నిరసన దీక్షకు పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలి అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదని, ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. పెండింగు బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో 1,800 మంది మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టుచేసి 14 పోలీస్స్టేషన్లకు తరలించారు. తిరుమలగిరి, బొల్లారం పోలీస్స్టేషన్లలో నిర్బంధించిన గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, యాదయ్యగౌడ్ తదితరులను మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు కలిసి సంఘీభావం ప్రకటించారు. అరెస్టయిన వారిలో సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, తదితరులు ఉన్నారు.
మాజీ సర్పంచులను బంధించడం సిగ్గుచేటు: హరీశ్
తమ సొంత ఖర్చులతో గ్రామాల అభివృద్ధికి విశేషంగా పాటుపడిన మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో మాజీ సర్పంచులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని మండిపడ్డారు. ప్రస్తుతం గ్రామల్లో పారిశుద్ధ్య నిర్వహణ లేక ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గామాల్లో చెత్త ఎత్తే ట్రాక్టరుకు డీజీల్ పోసే దిక్కులేదని, వీధి లైట్లు వేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. నిధులు విడుదల చేయకపోవడంతో మాజీ సర్పంచులు అప్పులభారం తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందని చెప్పారు. ‘8 నెలల కాంగ్రెస్ పాలనలో 8 పైసలైనా గ్రామాలభివృద్ధికి ఖర్చు పెట్టకపోగా, ఢిల్లీ నుంచి వచ్చిన రూ.800 కోట్ల నరేగా నిధులు, రూ.500 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను మీరే ఆపుకున్నరు, నెలా నెలా ఇవ్వాల్సిన పల్లెప్రగతి డబ్బులు బంద్ చేశారు’ అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల పెండింగ్ బిల్లులను చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల అరెస్ట్‌లను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.