హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మత విద్వేష రాజకీయాలను పౌరులంతా తిప్పికొట్టాలని రాజ్యసభ సభ్యుడు, ఏఐవైఎఫ్ మాజీ జాతీయ ప్రధా న కార్యదర్శి, పీ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ వర్‌షాప్ రెండోరోజు ఆదివారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడు తూ.. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న పాలకులను గద్దె దించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. మణిపూర్‌ను పాలిస్తున్న బీజేపీ వల్లే వివిధ జాతుల మధ్య హింస జరిగిందని, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ప్రజల మధ్య చీలికలు పెట్టారని ఆరోపించారు. ప్రపంచ శాంతి దూతగా అభివర్ణించుకునే మోదీ, మణిపూర్‌లో శాంతి నెలకొల్పడానికి ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడి బాధితులకు వెంటనే ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సుఖేందర్ మహేసరి, తిరుమలై రామన్ మాట్లాడుతూ కార్పొరేట్, మతోన్మాదశక్తులు అధికారంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని వాపోయారు. ఏఐ, కంప్యూటర్, డిజిటలీకరణ వంటి అంశాలతో విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ టీటీ జిస్మాన్, లెనిన్‌బాబు, అరుణ్, వికీ, హరీశ్బాల, భారతి, కరంవీర్ కౌర్, ఏఐవైఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లాఖాద్రీ, కే ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.