యాదగిరిగుట్ట, నవంబర్ 8: ‘ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది. అందుకే ప్రశ్నిస్తున్న మా లాంటివాళ్ల నోరు మూయించేందుకు గృహ నిర్బంధం చేస్తున్నరు.’ అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. వలిగొండ మండలం లో సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఆ మె విలేకరులతో మాట్లాడారు.
‘రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉండి ముఖ్యమంత్రిగా మారిన రేవంత్‌రెడ్డి అదే తరహాలో పాలన సాగిస్తున్నరు. ఉచిత బస్సు ప్రయాణాల్లో మహిళలు ఇబ్బంది పడుతున్నా గ్రౌండ్ రిపోర్టు తీసుకోలేని అసమర్థుడు రేవంత్‌రెడ్డి. భువనగిరికి వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని చెప్పాడు. 2 లక్షలు ఇస్తామని చెప్పి 41 వేల కోట్ల మాఫీకి 18 వేల కోట్లే మాఫీ చేశారు. స్వామి మీద ఒట్టేసి చెప్పి ఆ స్వామిని దర్శించుకునేందుకు వచ్చినవ్. నిరుద్యోగులను అంధకారంలోకి నెట్టివేసినవ్.
ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకొన్నవ్. ప్రజలు వ్యతిరేకిస్తారనే భయంతోనే ముందస్తు అరెస్టులు చేయిస్తున్నవ్. పింఛన్లు పెంచడం లేదు. స్వామివారి విమాన గోపురానికి గతంలోనే ఎందరో దాతలు వి రాళాలు ఇచ్చారు. చాలా బంగారం స్వామివారికి సమకూరింది. వైటీడీఏ సమీక్షలో బంగారు తాపడంపై నోరు మెదకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. వెంటనే బం గారు తాపడంపై స్పష్టమైన ప్రకటన చే యాలి. కేసీఆర్ పాలనలో యాదగిరిగుట్ట దేవస్థాన పునర్నిర్మాణం దాదాపు 95 శాతం పూర్తయింది. ఇంకా 5 శాతం మౌలిక వసతుల పనులు చేపట్టాల్సి ఉన్నది. రేవంత్‌రెడ్డి వచ్చి ఏడాది కావస్తున్నా రూపాయి కూడా కేటాయించలేదు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగడం లేదు. కేంద్రాల వద్ద రైతులు రాత్రింబవళ్లు ఎదురు చూస్తున్నరు’ అంటూ మండిపడ్డారు.