మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 23 : ఢిల్లీలో యువతను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తూ దాడులు చేస్తున్నదని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ లీక్‌లతో పిల్లల భవిష్యత్‌పై తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు 150 సార్లు పేపర్లు లీక్‌లు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్లీ పేపర్ లీక్ జరుగుతూనే ఉంటున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువకులపై లాఠీచార్జ్ జరుగుతున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. విద్యార్థులు, యువత కదిలిరావడంతో రాహుల్‌గాంధీ హడావుడిగా మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టారు. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు రాష్ర్టాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కూడా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి విద్యార్థి యువతకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్ చేసిన వారికి కఠిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ ఆందోళన సమయంలో విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.