సూర్యాపేట, మే 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి రేవంత్‌రెడ్డి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామన్న కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కంపెనీల్లో పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 90 శాతం దొడ్డు వడ్లు పండుతుంటే సన్న వడ్లకే బోనస్ అనడం హాస్యాస్పదమని అన్నారు. సన్న వడ్లకు బయట బోనస్ కంటే ఎక్కువ ధర పలుకుతుంటే ప్రభుత్వానికి ఎలా అమ్ముతారని ప్రశ్నించారు.
ఒక్క రూపాయి కూడా బోనస్ ఇచ్చే ఉద్దేశం లేక కాంగ్రెస్ దొంగ డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు. ‘అభివృద్ధి, సంక్షేమాలు పక్కన పెట్టి సెంటిమెంట్లు, మతం పేరిట ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ ఓ పక్కన ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి ఐదు నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ మరో పక్కన ఉన్నది. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే సర్వనాశనం కావడమే’ అని ఆయన పేర్కొన్నారు.
వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో బీఆర్ఎస్కు చెందిన రాకేశ్‌రెడ్డి మెరుగైన అభ్యర్థి అని అన్నారు. ఎమ్మెల్సీగా మంచి అభ్యర్థిని గెలిపించుకొని చైతన్యాన్ని నిరూపించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. తెలంగాణను ఆంధ్రాలో కలపాలని కొందరు పిచ్చి కలలు కంటున్నారని, వారి కలలు ఎప్పటికీ నిజం కావని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ట్రైకార్ మాజీ చైర్మన్ రాంచందర్‌నాయక్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.