కొల్లాపూర్, జూన్ 29: కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పుడే పార్టీలో సెగ మొదలైంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావుతోపాటు పలువురు పార్టీ నాయకులు జూపల్లి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తు తం జగదీశ్వర్‌రావు కాంగ్రెస్ శ్రేణులకు పెద్దదిక్కుగా ఉన్నారు. ఆయనతోపాటు మరో ఐదారుగురు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు.
వీరంతా ఎవరికివారే పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో కలహాల కాపురం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో డీసీసీ అధికారిక పార్టీ కార్యాలయం ఒకటి ఉండగా, చింతలపల్లి జగదీశ్వర్‌రావు, రంగినేని అభిలాషరావు, తిరుపతమ్మ కృష్ణయ్యగౌడ్ ఆఫీసులను ఏర్పాటుచేశారు. మరో బీసీ నేత డాక్టర్ కేతూరి వెంకటేశ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో కొల్లాపూర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాగర్జన పేరిట నిర్వహించిన బహిరంగ సభ కోసం దాదాపు రూ.3 కోట్ల దాకా చింతలపల్లి జగదీశ్వర్‌రావు భరించారని ఆయన వర్గీయులు చెప్తున్నారు.
ఆది నుంచీ వైరం
జూపల్లి, చింతలపల్లి మధ్య ఆది నుంచీ రా జకీయ వైరం ఉన్నది. 2009లో కాంగ్రెస్ అభ్య ర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతలపల్లి జగదీశ్వర్‌రావు 1,500 ఓట్లతో ఓడిపోయారు. ఆ తరువాత జూపల్లి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరి 2012 ఉప ఎన్నికల్లో 15 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కారు గుర్తుతో గెలుపొందిన జూపల్లి.. 2018లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో రాజకీయంగా, మానసికంగా కృంగిపోయారు. ఆ ఎన్నికల్లో జూపల్లిని ఓడించేందుకు జగదీశ్వర్‌రావు కృషి చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ జూపల్లికి దక్కితే ఇక తన రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందని జగదీశ్వర్‌రావు వర్గీయులు భావిస్తున్నారు. దీంతో ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ నాయకులు డి మాండ్ చేస్తున్నారు. ఒకవేళ జూపల్లికి మద్దతుగా పనిచేయాలని అధిష్ఠానం ఆదేశాలు జారీచేసినా.. తాను మాత్రం ఎన్నికల బరిలో ఉం టానంటూ జగదీశ్వర్‌రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇటీవల పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో జగదీశ్వర్‌రావు ఫాంహౌస్‌లో ఆయన వర్గీయులు సమావేశమై జూపల్లి పార్టీలో చేరికను వ్యతిరేకిస్తూ మీడియాకు ఎక్కారు. పార్టీ టికెట్ జూపల్లికి ఇస్తే ఆయనను ఓడించి తీరుతామని వ్యతిరేక వర్గీయులు హెచ్చరిస్తున్నారు.