గోదావరిఖని/జ్యోతినగర్/పెద్దపల్లి/ పెద్దపల్లి కమాన్, జూన్ 7: రెండున్నరేండ్లలోనే సింగరేణి సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణంలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బొగ్గు బకాయిలు భారీగా పెరిగిపోయి సంస్థ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రెండున్నరేండ్లలోనే రూ.12,377 కోట్ల బొగ్గు బకాయిలు సింగరేణికి చెల్లించలేదని, ఇది తాను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న సమాచారం పచ్చి నిజమని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ దిగిపోయేనాటికి సింగరేణి సంస్థ బొగ్గు బకాయిలు రూ.7,355 కోట్లు ఉండగా, అందులో తెలంగాణ ఏర్పడక ముందు రూ.1,958 కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు.
అంటే పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.5 వేల కోట్లలోపే బొగ్గు బకాయిలు ఉంటే, కాం గ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండున్నరేండ్లలోనే రూ.12వేల కోట్ల పైచిలుకు బకాయిలు పేరుకుపోయాయని స్పష్టంచేశారు. ఒకవైపు, బొగ్గు బకాయిలు ఇవ్వకుండా సింగరేణి డబ్బులతో సోకులకు పోయి మూసీ సుందరీకరణ పేరిట లక్ష కోట్లు, ఫ్యూచర్‌సిటీ పేరుతో మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో సింగరేణి సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి 19వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తే, రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్‌షేక్ పథకాన్ని తీసుకొచ్చి ఉద్యోగాలు ఊడగొడితే, చంద్రబాబు బంటుగా ఉన్న రేవంత్ నాడు కేసీఆర్ ఇచ్చిన 19వేల డిపెండెంట్ ఉద్యోగాలపై విచారణ చేస్తామనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికే డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టి మెడికల్ బోర్డులు నిర్వహించకుండా అడ్డుకుంటూ కార్మికుల నోట్లో మట్టికొట్టిన రేవంత్ ప్రభుత్వంపై కార్మికులు గుర్రుగా ఉన్నారని చెప్పారు. కార్మికులు ఎవరిని అడిగినా ఇప్పు డు ‘కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో’ అని ముందుకు సాగుతున్నారన్నారు.
కుంభకోణాల మయంగా సింగరేణి
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ కుంభకోణాల మ యంగా మారిందని హరీశ్‌రావు ఆరోపించా రు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలో సైట్విజిట్ పేరుతో స్కామ్, సోలార్ విద్యుత్తు పేరుతో స్కామ్, బొగ్గు ఉత్పత్తి రాకుండా వచ్చినట్టు చూపించే స్కామ్.. ఇలా ఎన్నో కుంభకోణాలతో సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థంగా మారిందని దుయ్యబట్టారు. ‘సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో సైట్విజిట్ నిబంధన విధించి రేవంత్‌రెడ్డి తన బామ్మర్ది సృజన్‌రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది నిజం కాదా? సోలార్ విద్యుత్తు పేరుతో పెద్ద మొత్తంలో కమీషన్లు కొల్లగొట్టడానికి పథకం రచించింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటంతో నైనిబ్లాక్ను రద్దు చేశారని గుర్తుచేశారు.
రాని బొగ్గు ఉత్పత్తికి ఐటీ చెల్లింపులా ?
సింగరేణి సంస్థలో చైర్మన్ అండ్ మేనేజింగ్ పనిచేసిన వ్యక్తి తన వ్యక్తిగత ఇమేజ్ కోసం దాదాపు 90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రాకుండా వచ్చినట్టు చూపించి, దానికి ఇన్కమ్ ట్యాక్స్‌తోపాటు అన్ని రకాల ట్యాక్స్‌లు చెల్లించి సంస్థను దివాలా తీశారని హరీశ్‌రావు ఆరోపించారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు లేకున్నా ఉన్నట్టుగా చూపించి దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయని, అవి ఎక్కడ ఉన్నాయో చెప్పాలని తాను డిమాండ్ చేస్తే.. సింగరేణి యాజమాన్యం 26 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నదని, అవి కూడా లేని పరిస్థితి ఉన్నదని హరీశ్‌రావు ఆరోపించారు. రామగుండం డివిజన్లో ఏడు లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారికంగా పేర్కొన్న యాజమాన్యం, తాను సీఎస్పీలో బొగ్గు నిల్వలను చూసేందుకు వెళ్తే 200 మంది పోలీసులతో అడ్డుకున్నదని విమర్శించారు. నిజంగా బొగ్గు నిల్వలు ఉంటే వాటిని ఎందుకు చూడనివ్వడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీలో సమావేశాల్లో సింగరేణిపై ప్రశ్నిస్తామని చెప్పారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, నాయకులు వ్యాల్ల హరీశ్‌రెడ్డి, కౌశికహరి తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు
పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 సీఎస్పీలో బొగ్గు నిల్వల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన గోదావరిఖని ఎన్టీపీసీలో సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ ముందుగా సీఎస్పీలో బొగ్గు నిల్వలను చూసేందుకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్‌తో కలిసి అక్కడికి వచ్చారు. దీంతో సింగరేణి యాజమాన్యం తన సెక్యూరిటీ విభాగంతోపాటు పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించి వారిని అడ్డుకోవడంతో హరీశ్‌రావు వాగ్వాదానికి దిగారు. వెంటనే సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్‌ను ఫోన్లో సంప్రదించేందుకు హరీశ్‌రావు ప్రయత్నించగా, లిఫ్ట్ చేయకపోవడం, 200 మంది పోలీసులను మోహరించి అడ్డుకోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కాగా, సింగరేణి సంస్థలో నాలుగు మిలియన్ టన్నులకుపైగా బొగ్గు నిల్వలు మాయమయ్యాయని ఇటీవల హరీశ్‌రావు ఆరోపించగా, దీనిపై సింగరేణి యాజమాన్యం స్పందిస్తూ, సింగరేణి సంస్థలో 26 లక్షల టన్నులు, ఇందులో రామగుండం రీజియన్‌లోనే ఆరు లక్షల నుంచి ఏడు లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని శనివారం ప్రకటించింది. అయితే, రామగుండం రీజియన్‌లో ఉన్న నిల్వలను ఎందుకు చూడనివ్వడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. రామగుండం సీఎస్పీలో 50 వేల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని తనకు స్పష్టమైన సమాచారం ఉన్నదని చెప్పారు.
రేవంత్ నయా హిట్లర్
తెలంగాణలో నయా హిట్లర్ రేవంత్‌రెడ్డి అని, పేద ప్రజలను ఊచకోత కోసిన ఆ నియంతకు పట్టిన గతే మున్ముందు రేవంత్‌కు పడుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. హిట్లర్ చేసిన పాపాల వల్ల ఇప్పటికీ జర్మనీ దేశం ప్రపంచానికి క్షమాపణ చెప్తున్నదని, రేవంత్‌రెడ్డి చేసిన పాపాలకు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, హరీశ్‌రావు మాట్లాడారు. కూలీ నాలి చేసుకొని పైసా పైస కూడబెట్టి సొంతింటి కలను నెరవేర్చుకుంటే, రేవంత్‌రెడ్డి హైడ్రా తెచ్చి పేదల ఇండ్లను కూలగొట్టి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. పేదల కడుపు మండి రేవంత్‌రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ గెలువడని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో సింగరేణి ప్రశ్నార్థకం
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో నిర్వీర్యం చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే ఆగంపట్టించింది. మనుగడ ప్రశ్నార్థకం చేసింది. కార్మికులకు డిపెండెంట్ లేదు, మెడికల్ బోర్డు లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ వారసత్వం కల్పించగా విచారణ పేరిట కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. 32 శాతం వరకు కార్మికులకు లాభాల వాటాను కేసీఆర్ ప్రకటించగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 16 శాతం వాటా ఇచ్చి బయటికి మాత్రం 33శాతంగా ప్రకటించడం శోచనీయం.
– కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీమంత్రి