హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర 2004తోనే ముగిసిందని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జగదీశ్‌రెడ్డి.. టీడీపీ మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. ఏపీకి సంబంధించిన మహానాడులో తెలంగాణకు సంబంధించిన ముచ్చటెందుకు? అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి తన వల్లే జరిగిందని ఏపీ బాబు గొప్పలు చెప్తుంటే నవ్వొస్తున్నదని ఎద్దేవా చేశారు.
‘నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే.. ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదు? మీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమలేకనా? ఎప్పటికైనా హైదరాబాద్‌కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామని అనుకుంటున్నావా? దేని కోసం తెలంగాణ గురించి మహానాడులో మాట్లాడుతున్నవ్.. చంద్రబాబూ?’ అని జగదీశ్‌రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు పాలన ముగిసిన 2004లో తలసరి ఆదాయం రూ.26 వేల లోపే ఉన్నదని చెప్పారు. ఏపీలో 2014 నుంచి తన ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ఒకసారి గుర్తుచేసుకోవాలని చురకలంటించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోయాయని, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని వివరించారు.