దేవరుప్పుల, జూన్ 28 : అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు స్థాపించి తెలంగాణ బిడ్డలకు అండగా ఉంటున్న ‘టెక్స్టార్ ’ నిర్వాహకులు అభినందనీయులని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. డాలస్‌లో వరంగల్ బిడ్డలు అశోక్, రఘు చిట్టిమల్ల టెక్స్టార్ ఐటీ కంపెనీ నెలకొల్పగా ఆదివారం ఎర్రబెల్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు కంపెనీ శాఖలను విస్తరించడమేకాక, సొంత భవనాలు నిర్మించుకోవడం, హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. కంపెనీలో 1,500 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో 500 మంది వరంగల్‌కు చెందిన వారు కావడం శుభపరిణామమని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన రాగానే టెక్స్టార్ ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణవాసి వెన్నమనేని సౌజన్య కొత్తగా నెలకొల్పిన తెలంగాణ స్పైసీ కిచెన్ హోటల్‌ను ఎర్రబెల్లి ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.