కొడకండ్ల, మే 16 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 679 కాలయాపన కోసమేనని, కాలపరిమితి లేకుండా కమిటీని వేయడం ఉద్యమకారులను వంచించడమేనని జీసీసీ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు ధరావత్ గాంధీనాయక్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీకి నిర్దిష్ట గడువులేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుటిలనీతికి నిదర్శమని మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారులను గుర్తించి, 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల సాయం, హెల్త్కార్డులతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామనిచెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా నేటికీ ఉద్యమకారులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా సీమాంధ్రనేతలను ఎదురించి పోరాడిన ఉద్యమకారులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ జీవోకు తక్షణమే సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.