హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : కొత్త కోర్సుల కోసం ఉబలాటపడిన ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు కొత్త చిక్కు వచ్చింది. పాత సీట్లు రద్దు చేసుకోవడం, కొత్త సీట్లకు ఇంకా ఆమోదం లభించకపోవడం సమస్యగా పరిణమించింది. ఇం తకు ఆ సీట్లు ఉన్నట్టా..? లేనట్టా..? అన్న సందేహాలు కాలేజీ యాజమాన్యాలను పట్టిపీడిస్తున్నాయి. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రంగం సిద్ధం చేసింది. దాదాపు 260 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చాయి. పాత కోర్సులు రద్దుచేసుకుని, కొత్త కోర్సులు, సీట్ల కోసం దరఖాస్తు సమర్పించాయి. అయితే కొత్త కోర్సులకు ఆమోదం లభించలేదు. దోస్త్ వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు.
ఇప్పటికే దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. రెండో విడత సీట్ల కేటాయింపునకు గడువు దగ్గరపడుతున్నది. సాంకేతిక అంశాలను కారణంగా చూపి అధికారులు కొత్త కోర్సులు ఆమోదించడంలేదు. కొత్త కోర్సులు ఇక లేనట్టేనన్న ప్రచారం జరుగుతున్నది. దీంతో సీట్లతోపాటు అఫిలియేషన్ కోసం చెల్లించిన మొత్తం బూడిదపాలయ్యిందని యాజమాన్యాలు గగ్గోలుపెడుతున్నాయి. రద్దుచేసుకున్న సీట్ల సంగతి. తాము కట్టిన రుసుముల సంగతి తేల్చాలని కోరుతున్నాయి. డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు తగ్గే ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు 2లక్షలు దాటుతున్నాయి. ఇంజినీరింగ్‌కు డిమాండ్ తగ్గుతున్నది. అంతో ఇంతో డిగ్రీకే డిమాండ్ కనిపిస్తున్నది. ఈ పంచాయితీతో డిగ్రీ ప్రభ తగ్గుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.