హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): ఒకవైపు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభు త్వం.. మరోవైపు అదే గిరిజన మహిళా రాష్ట్రపతి చేతనే గిరిజన, ఆదివాసీల కన్ను పొడిచే విధంగా అటవీ సంరక్షణ నిబంధనలకు అనుమతించేలా చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ నిబంధనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా కార్పొరేట్ సంస్థలకు అడవులు, ప్రకృతి సంపదను కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నదని అన్నారు. ఆదివాసీలకు కనీసం అడవిలో జీవించే హకు కూడా లేకుండా చేస్తున్నదని మండిపడ్డారు. ఇది ఆదివాసీల ఉనికినే ప్రశ్నార్థకం చేసే అత్యంత ప్రమాదరకరమైన తిరోగమన చర్య అన్నారు. తక్షణమే అటవీ సంరక్షణ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సుందే కుటుంబరావు అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పర్యావరణానికి, ఆదివాసీల జీవితాలకు తూట్లు పొడిచిందని, వామపక్షాల ఒత్తిడితో యూపీఏ హయాంలో తీసుకువచ్చిన అటవీ హకుల గుర్తింపు చట్టం (2006)ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొకిందన్నారు. ఇప్పటికే షెడ్యూ ల్డు ప్రాంతాల్లో బొగ్గు గనులను సైతం గ్రామసభల నిబంధనను పాటించకుండానే ప్రైవేట్‌పరం చేసిన కేంద్ర ప్రభుత్వం అదే పద్ధతిలో అటవీ సంపదను ప్రైవేట్‌పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. పచ్చని అడవులను, అటవీ సంపదను కాపాడుకునేందుకు గిరిజన సం ఘాలు, యావత్ ప్రజానీకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గుత్తి కోయలు కూడా ఆదివాసి గిరిజనులేనన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, జువారి రమేష్, భూక్యా శ్రీనివాస్, శంకర్, స్వరూప, దస్రు తదితరులు పాల్గొన్నారు.