హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై విచారణ కమిషన్ చైర్మన్, జస్టిస్ ఘోష్ దృష్టిపెట్టినట్టు తెలిసింది. కాంట్రాక్ట్ ఏజెన్సీల అకౌంట్స్, స్టేట్మెంట్స్ పరిశీలించాలని, ‘రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్’ నుంచి డాటా తీసుకోవాలని యోచిస్తున్నట్టు కమిషన్‌వర్గాలు వెల్లడించాయి. 2015లో ఏర్పాటైన అనంతరాములు కమిటీలోని విశ్రాంత ఇంజినీర్లతో కమిషన్ కార్యాలయంలో జస్టిస్ ఘోష్ శనివారం సమావేశమయ్యారు. ప్రాజెక్టుపై ఇచ్చిన అప్పటి రిపోర్ట్‌ను జస్టిస్ ఘోష్‌కు రిటైర్డ్ ఇంజినీర్లు అందజేశారు. మేడిగడ్డను కేసీఆరే సూచించారని రిటైర్డ్ ఇంజినీర్లు వివరించినట్టు తెలిసింది. ఇప్పటివరకు వరకు ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీలను విచారించిన జస్టిస్ ఘోష్, అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించారు. వాటి పరిశీలన తర్వాత తిరిగి విచారణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. అవసరమైతే సీడబ్ల్యూసీ వాళ్లనూ విచారణకు పిలవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏఈఈ, డీఈఈలను విచారించాలా? లేదా? అన్నదానిపైనా ఆలోచిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.