Election Code | నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నల్లగొండ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ నేత పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో కాంగ్రెస్ పార్టీ కలర్స్ బ్యాక్ గ్రౌండ్‌తో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నుంచే వీటిని ఏర్పాటు చేయడం ప్రారంభించి శనివారం చాలా చోట్ల వీటిని బిగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. కానీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఉన్న జిల్లా కేంద్రంలోనే వీటిని ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీటిపై శనివారం బీఆర్ఎస్ నేతలతో పాటు పలు సంఘాల నేతలు సైతం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వాట్సాప్‌తో పాటు ఇతర మాధ్యమాల్లో దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సైతం పిర్యాధు చేసినట్లు తెలిసింది. అయినా సదరు నేత ఫ్లెక్సీలను తొలగించేందుకు అధికారులు వెనకంజ వేస్తుండడం పట్టణంలో చర్చనీయాంశమైంది. శనివారం సాయంత్రం వరకు ఈ ఫ్లెక్సీలు ఇలాగే దర్శనం ఇస్తుండడంతో విపక్ష నేతలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక విధంగా ఇతర పార్టీల పట్ల మరోలా వ్యవహరించడం సరికాదని చెప్తున్నారు. తక్షణమే చర్యలు చేపట్టి ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు బాధ్యులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.